ప్రకృతి అందాల స్వర్గధామం.. కోనసీమ చూసి తీరాల్సిందే!


‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.

కోనసీమ ప్రకృతి పదం.. మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయలున్నాయి. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. కోనసీమకు అమలాపురం పట్టణం ప్రధాన కేంద్రం కాగా.. రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట ప్రధాన ప్రాంతాలు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రావులపాలెంను కోనసీమ ముఖద్వారంగా పిలుస్తారు.

అందాల సీమ
మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు, పచ్చని చెట్ల తోరణాలు, అరటి గెలలు, కొబ్బరి తోటలు, మంచు తెరలు ఇలాంటి మనోహర దృశ్యాలన్నీ కోనసీమ వాసులకు సర్వసాధారణం. పుష్కలమైన ప్రకృతి వనరులు, కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం కోనసీమకే వన్నె తెస్తుంటాయి. కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా అన్ని రకాల పంటలు పండిస్తారు.

కోనసీమ ప్రాంతం పురాతన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా భాసిల్లుతోంది. అతిథులకు మర్యాదలు చేయడంలో కోనసీమ వాసులకు కొట్టేవాళ్లే ఉండరు. అన్నిచోట్ల కొట్టి చంపితే.. కోనసీమ వాళ్ల తిండి పెట్టి చంపేస్తారన్న నానుడి ఉంది. సంక్రాంతి పండుగకు నిర్వహించే ముగ్గుల పోటీలు, కోనసీమలో జరిగే కోడిపందేలు, తీర్థాలు, జాతరలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేమో.

పలకరింపులు భలే ఉంటాయ్
కోనసీమలో పలకరింపులు భలే వింతగా ఉన్నాయి. అక్కడ ఎదుటివారిని ఆయ్, అండి అంటూ ప్రత్యేక శైలిలో మర్యాదగా పిలుస్తుంటారు. ఈ తరహా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మనకు కనిపించదు. ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం.

ప్రసిద్ధ ఆలయాలకు కేంద్రం
కోనసీమ ప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధ, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో అయినవిల్లిలోని విఘ్నేశ్వరుడి ఆలయం, మురమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం, ముక్తేశ్వరంలోని క్షణ ముక్తేశ్వరాలయం, పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం మందపల్లిలోని శనీశ్వర ఆలయం ముఖ్యమైనవి. అవివాహితులు మురముళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్మకం. అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ప్రధాన రహదారి నుంచి అర కిలోమీటరు ప్రయాణిస్తే ఆ ఆలయాన్ని చేరుకోవచ్చు.

కోనసీమ వంటలు ఆహా అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్‌కు కోనసీమ పెట్టింది పేరు. చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. గోదావరి నదిపై వంతెనలు నిర్మించక ముందు ప్రజా రవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే కొనసాగిస్తూనే ఉన్నారు. కోనసీమ ప్రాంతం సినిమా షూటింగులకు కూడా ప్రసిద్ధి. గతంలో అనేక పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇక్కడ జరిగాయి.

కోనసీమ చేరుకోవటం ఎలా ?
వాయు మార్గం: అమలాపురానికి సమీపంలోని ఉన్న అతిపెద్ద నగరం రాజమండ్రి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి ప్రతి అరగంటకు అమలాపురానికి బస్సు సౌకర్యం ఉంది.


రైలు మార్గం: కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, గంగవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో రైల్వే స్టేషన్‌లు కలవు. రైలు మార్గం ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి బస్సు ద్వారా చేరుకోవచ్చు.
బస్సు/ రోడ్డు మార్గం : హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి నుండి కోనసీమలోని ప్రతి ప్రాంతానికి బస్సు సర్వీసులు ఉన్నాయి.