116 అడుగుల సాయినాథుడు.. ప్రపంచంలోనే అతిపెద్ద బాబా విగ్రహం

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్‌ ప్రసిద్ధ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ప్రపంచంలోనే అతిపెద్ద సాయినాథుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా.. ఇంకెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సమీపంలోని రేపూరు గ్రామంలో నెలకొల్పిన 116 అడుగుల భారీ సాయిబాబా విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.

కాకినాడ నుండి ఇంద్రపాలెం మీదుగా గొల్లలమామిడాడ వెళ్లే మార్గంలో 10 కిలోమీటర్ల దూరంలో ఆ విగ్రహం ఉంది. షిరిడిసాయి మందిరానికి అనుబంధంగా నిర్మించిన ఈ సాయినాథుని విగ్రహం.. కాలుపై కాలు వేసుకుని నిర్మలంగా కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తుంది. చుట్టుప్రక్కల 10 కిలోమీటర్ల దూరం వరకూ స్పష్టంగా కనిపించడం దీని ప్రత్యేకత.

సాయి సేవాశ్రమ్ వ్యవస్థాపకులు, సాయిభక్తులు శ్రీ అమ్ముల సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన విగ్రహం నిర్మాణం 12 సంవత్సరాల పాటు కొనసాగింది. 2012, డిసెంబర్ 12న ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. సుమారు వెయ్యి టన్నులకు పైగా బరువున్న ఈ విగ్రహాన్ని నాలుగు అంతస్తుల భజన మందిరం నిర్మించి దానిపై సాయి కూర్చున్నట్టుగా నిర్మించారు. దీని కోసం సుమారు రూ. 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. సాయి విగ్రహాన్ని దర్శించుకునేందుకు నిత్యం వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

ఆలయంలో ఉదయం 5.15 గంటలకు కాకడ హారతి, 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6.00 గంటలకు సంధ్యాహారతి, రాత్రి 8.00 గంటలకు శయన హారతి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి గురువారం ఉదయం 8.30 గంటలకు సాయి పల్లకి సేవ ఉంటుంది. ఈ మందిరానికి చేరుకోవాలంటే ముందుగా కాకినాడ చేరుకుని అక్కడి నుంచి ఆటోలో వెళ్లాలి. సొంత వాహనాలపై వచ్చే మందిరాన్ని సులభంగా చేరుకోవచ్చు.