‘దక్షిణామూర్తి’.. పరమశివుని జ్ఞానగురువు అవతారం

వైష్ణవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ హయగ్రీవుడిని ఆరాధిస్తారు. శైవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ దక్షిణామూర్తిని ఉపాసిస్తారు. శివకేశవులు వేరు కారని భావించే వారు ఇద్దరినీ ఆరాధిస్తారు. దక్షిణామూర్తి అనబడేది అతి ప్రాచీనమైన ఈశ్వర తత్త్వం. సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలనుంచి వ్యక్తమైన రూపాలే సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు. వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు. అందుకు వారు అంగీకరించక తమకు జ్ఞానం కావాలని అక్కడినుంచి వెళ్లిపోయారు. జ్ఞానం కావాలని కోరుకోవటం కూడా ఒక రకమైన అజ్ఞానమే. మనకు నియంత్రించిన విధి, కర్తవ్యాలను నిర్వర్తించక మోక్షం కోసం అడవులకు పోయే వారందరూ నిజానికి అహంభావులు,అజ్ఞానులు. శివుడు ఇది గమనించే వారి అజ్ఞానాన్ని తొలగించాలనే తలంపుతో దక్షిణామూర్తి రూపంలో వారికి ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా శ్రీ దక్షిణామూర్తి ప్రధమ శిష్యులు వారే. అజ్ఞానం నశించటమే జ్ఞానం. అజ్ఞానం, అహంకారాలు నశించిన తర్వాత మనిషి తేజోవంతుడైన ఋషి అవుతాడు. దక్షిణామూర్తి పాదాల కింద ఉన్నది తమో గుణ రూపానికి ప్రతీక. వాటిని శివుడు తన కాలితో అదిమిపడుతాడు. అది కూడా అదృష్టమే. అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆదిగురుతత్త్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్న మాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం. ఈ తత్వాన్నితెలుసుకోవటమంటే జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగివుండటమే.

సంగీత, సాహిత్యాల, యోగ, తాంత్రిక విద్యల కలయికే దక్షిణామూర్తి రూపం. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి ,అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి, జ్ఞానం, మోక్షాన్ని పొందవచ్చు. దక్షిణామూర్తి అంటే దక్షిణ దిక్కు వైపు కూర్చున్న మూర్తి అనే అర్ధం వాడుకలో ఉంది. అయితే దక్షిణ దిశ మృత్యుదేవత మార్గం. అంటే కొత్తదనానికి దారి. ప్రతి శివాలయంలో కూడా ఈయన విగ్రహం దక్షిణ దిక్కు వైపే ఉంటుంది. దక్షిణ దిశగా ఉండే దేవతా విగ్రహం దక్షిణామూర్తి ఒక్కడిదే. దక్షిణామూర్తి దక్షిణం వైపు ఉన్న మర్రి చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉంటాడు. అలా ఉండే దక్షిణామూర్తి అర్హులైన ఋషులకు తత్వ బోధ చేస్తుంటాడు. విశేషం ఏమంటే ఆయన బోధించేది అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. దక్షిణామూర్తి తన మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేస్తారు.

దక్షిణామూర్తి జింక చర్మాన్ని ధరిస్తాడు. ఆయన శుభప్రదుడు. దక్షిణామూర్తికి కుడి వైపున జమదగ్ని, భృగు, వసిష్ఠ, నారద మహర్షులు ఉంటారు. భరద్వాజ, సౌనక, అగస్త్య, భార్గవ లాంటి వారు ఆయనకు ఎడమవైపున ఉంటారు. స్వామికి మీసాలు, గడ్డం ఉండవు. దీని అర్ధం ఆయన నిత్య యవ్వనుడు. జనన మరణాలకు అతీతుడు. స్వామి కూర్చున్న మర్రి చెట్టు హిమవత్పర్వత ప్రాంతంలో ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరంలో శివుని విగ్రహం దక్షిణం వైపు ఉంటుంది. అంటే అక్కడి శివుడినే దక్షిణామూర్తి స్వరూపంగా భావిస్తారు. ఆది శంకరుడు ఆయన గురించి చేసిన స్తోత్రం అద్వైత సిద్ధాంతంతో కూడి ఉంటుంది. దక్షిణామూర్తిని ఆరాధించేవారు ముముక్షువులు మోక్షాన్ని పొందగలరు.

గురు గ్రహదోషాలు ఉన్నవారు క్రమం తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం వల్ల గురు గ్రహబలం కలుగుతుంది. దుఖాలకు మూలమైన అజ్ఞానం అటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే స్వామియే దక్షిణామూర్తి.

దక్షిణామూర్తి స్త్రోత్ర పారాయణం వల్ల అద్భుత ఫలితాలు

 • దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల అపమృత్యువు దరిచేరదు.
 • దక్షిణామూర్తి స్తోత్రం పారాయణంతో అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని అందిస్తారు.
 • కష్టాలకు ప్రధాన కారణం గురు గ్రహ భలం లేకపోవడం. నిత్యం పారాయణం చేయడం వల్ల గురు గ్రహం బలం పెరిగి కష్టాలు, భాధాలూ తొలగడంతో పాటు జీవితంలో తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను నసింపజేస్తుంది.
 • విద్యా బుద్దులు చేకూరాలనుకునేవారు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చేయాలి.
 • జ్ఞానం కోరుకునే వారికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని సైతం ప్రసాదించే స్వామి దక్షిణామూర్తి.
 • దక్షిణామూర్తిని ఆరాధించే వారికి సంపదకు కొదవ ఉండదు.

దక్షిణామూర్తి యొక్క 16 రూపాలు

 1. శుద్ధ దక్షిణామూర్తి
 2. మేధా దక్షిణామూర్తి
 3. విద్యా దక్షిణామూర్తి
 4. లక్ష్మీ దక్షిణామూర్తి
 5. సాంబ దక్షిణామూర్తి
 6. వటమూల దక్షిణామూర్తి
 7. వాగీశ్వర దక్షిణామూర్తి
 8. హంస దక్షిణామూర్తి
 9. లక్కుట దక్షిణామూర్తి
 10. చిదంబర దక్షిణామూర్తి
 11. వీర దక్షిణామూర్తి
 12. వీరభద్ర దక్షిణామూర్తి
 13. కీర్తి దక్షిణామూర్తి
 14. బ్రహ్మ దక్షిణామూర్తి
 15. శక్తీ దక్షిణామూర్తి
 16. సిద్ద దక్షిణామూర్తి

దక్షిణామూర్తి స్త్రోత్రం

మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || ౧ ||

వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || ౨ ||

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా |
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః || ౩ ||

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || ౪ ||

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || ౫ ||

చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః || ౬ ||

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే |
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః || ౭ ||

ఇతి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ |