తిరుమలలో ‘తుంబుర తీర్థం’ చూశారా.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే

కలియుగ వైకుంఠం తిరుమలలో మనకు తెలియని తీర్థాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది తుంబురు తీర్థం. ఇది సాక్షాత్తూ తుంబురుడు తపస్సు చేసిన ప్రదేశంగా పురాణాలు చెబుతున్నాయి. అందమైన ప్రకృతి, అడవి జంతువుల ఆవాస ప్రదేశం. తిరుమల పాపవినాసం నుండి 7.5 కిలోమీటర్లు దట్టమైన శేషాచల కొండల్లో కాలినడకన ప్రయాణం చేస్తే ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండలు, గుట్టలు , వాగులు, రెండు కొండల మధ్య ప్రయాణం ఎంతో క్లిష్టంగానూ ఆహ్లాదకరంగానూ ఉంటుంది. సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే అక్కడికి వెళ్లొచ్చు. ప్రతీ సంవత్సరం పాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా మూడు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తారు.

పాపవినాసం నుండి దట్టమైన అడవీ మార్గంలో కొండపైన నుండి దిగువకు సుమారు 5కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ తర్వాత రెండు కిలోమీటర్లు యేటి ప్రయాణం ఉంటుంది. అక్కడి నుంచే అసలుసిసలైన ప్రయాణం మొదలవుతుంది. అరకిలోమీటరు దూరానికి సుమారు గంట సమయం పడుతుంది. పెద్దపెద్ద బండలు ఎక్కుతూ.. దిగుతూ నాలుగు చోట్ల నడుముకు మించి లోతు నీటితో నడవాలి. రెండుగా చీలిన కొండ మధ్యలో నునుపైన కొండబండపై ప్రయాణించాలి. ఏమాత్రం అడుగు తడబడినా లోయలోకి జారిపోతామేమోనన్న భయం వెంటాడుతుంది. ఇవన్నీ దాటుకుని నిదానంగా కొండ చివర ఉన్న గుహలాంటి ప్రదేశానికి చేరుకోగానే పైనుంచి జాలువారుతున్న జలపాతం మనసును ఆహ్లాదపరుస్తుంది. అప్పటివరకు మనం పడ్డ కష్టాన్ని ఆ ప్రకృతి రమణీయ దృశ్యం మైమరపిస్తుంది. తుంబురుడు తపస్సు చేసిన ప్రదేశానికి కొద్దిదూరంలో ఆయన విగ్రహం ఉంటుంది. ఆయనకు పూజలు చేసిన అనంతరం భక్తులు తిరుగు పయనమవుతారు.

తుంబురు తీర్ధం వద్దకు వెళ్ళేటప్పుడు కొండ దిగువకు వెళ్ళాలి కాబట్టి సులభంగానే చేరుకుంటారు. అయితే తిరుగు ప్రయాణం మాత్రం భయంకరంగా ఉంటుంది. ముందుగా రెండున్నర కిలోమీటర్లు ఎలాగోలో వచ్చేయొచ్చు. ఆ తర్వాత 5కిలోమీటర్ల మేర కొండ పైకెక్కాలి. దీంతో ఎక్కుడు మొదలయ్యాక చాలామంది నడకలేక దారి పొడవునా కూలబడిపోతుంటారు. కొంతమందికైతే తిరిగి గమ్యస్థానానికి వెళ్లగలమా? అన్న సందేహం కలుగుతుంటుంది. ఈ మార్గంలో చీకటి పడితే అడవి జంతువులు సంచరిస్తుంటాయి కాబట్టి సాయంత్రం 7 గంటలకల్లా పాపవినాసం చేరుకోవాలి. తుంబురు తీర్థం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భక్తులకు పెద్దగా తెలియదు. కానీ తమిళనాడు, కర్ణాటకకు చెందిన భక్తులు ఇక్కడికి ఎక్కువగా వెళ్తుంటారు. తుంబుర తీర్థ ప్రయాణం చాలా కష్టమైనప్పటికీ.. ఒక్కసారి వెళ్తే మాత్రం జీవితంలో ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవచ్చు.