పిల్లల తలపై భోగి పళ్లు వేయడం వెనుక అంతరార్ధమిదే..

Telugu Box Office


భోగి పండగ రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. నేటి కాలం పిల్లలకు ఇది చూసేందుకు వింతగా అనిపించినా దీనికి వెనుక పెద్దల ఆలోచన, శాస్త్రీయ ఆధారాలున్నాయి. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరుంది. రేగి చెట్లు, రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల శ్రీలక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది. దీంతో పాటు పిల్లలకి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం

బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మరంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను తలపై పోయడం ద్వారా బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. గనుక వీటిని తల మీద పోయడం వల్ల వీటిలోని విద్యుచ్ఛక్తి, శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువల్లే పిల్లలకి భోగి పండ్లు పోసి అశీర్వదిస్తారు. ఇలా మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్ధాలు, అంతరార్ధాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార, సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని మసులుకుంటే అవి మనకి మార్గదర్శకం అవుతాయి.

Share This Article