ఈ అమ్మవారికి బంగారం, డబ్బే ప్రసాదం

ఏ ఆలయంలో అయినా దేవుడికి రకరకాల తినుబండారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకు భిన్నంగా ఓ ఆలయంలో డబ్బు, బంగారం, విలువైన రాళ్ల నగల్ని అమ్మవారికి నివేదిస్తారు భక్తులు. పండుగలూ ప్రత్యేక సందర్భాల్లో వాటినే ప్రసాదంగానూ పంచుతారు. మధ్యప్రదేశ్‌లోని రాత్లాంలో ఏకంగా వజ్ర వైఢూర్యాలతో పూజలందుకుంటోంది మహాలక్ష్మి అమ్మవారు. వందల ఏళ్లక్రితం నిర్మించిన ఆలయమిది. అప్పట్లో రాజులు తాము సంపాదించుకున్న సంపదను ఈ అమ్మవారికి నివేదించేవారట. అలా చేయడం వల్ల ఆ ధనం రెట్టింపవుతుందని వారు నమ్మేవారట. అందుకే అప్పటి నుంచి అక్కడ భక్తులు అమ్మవారికి పాయసం, చక్రపొంగలి, రవ్వకేసరి, పులిహోర వంటి వాటికి బదులుగా డబ్బునీ, బంగారాన్నీ నైవేద్యంగా సమర్పిస్తున్నారట.

భక్తులకు నిత్యం దర్శనమిస్తూ, ఏడాది పొడవునా పూజలందుకునే రాత్లాం మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు మొక్కుల కింద కోట్లాది రూపాయల నగదు, బంగారం- వెండి నాణేలు, నగలు సమర్పించుకుంటారు. అందుకే ఆ దేవాలయం కుబేరనిధిగానూ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండుగలూ, ప్రత్యేక దినాలూ, దీపావళి సమయంలో అమ్మవారినీ, ప్రాంగణాన్నీ పూలతో కాకుండా డబ్బు, బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో అలంకరిస్తారు. అందుకోసం అమ్మవారికి కానుకలుగా అందినవాటితో పాటు భక్తుల వద్ద నుంచి కూడా డబ్బూ, నగలూ స్వీకరిస్తారు. ఆ సమయంలో ఆలయం ట్రస్టు సభ్యులు డబ్బూ, నగలూ ఇచ్చిన వారి వివరాలను నమోదు చేసుకుని ఎంత ఇచ్చారో రాసి వారి చేత సంతకం పెట్టించుకుని టోకెన్‌ ఇస్తారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలన్నీ అయ్యాక టోకెన్ల ఆధారంగా ఎవరివి వారికి అందజేస్తారు.

దీపావళి, ధనత్రయోదశి సమయంలో అమ్మవారికి డబ్బూ, బంగారం సమర్పించిన భక్తులు అక్కడికి దర్శనానికి వచ్చిన వారికి బంగారం, వెండి నాణేలను ప్రసాదంగా పంచుతుంటారు. అలా పంచడం వల్ల తాము కూడా సిరి సంపదలతో వర్థిల్లుతామని నమ్ముతుంటారు. అందుకే అక్కడ బంగారు నాణేలు గ్రాము కంటే తక్కువ బరువులో వివిధ పరిమాణాల్లో దొరుకుతాయి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు వాటిని కొనుగోలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తరవాత పంచుతారన్నమాట.

ఎలా చేరుకోవాలంటే..

విమానంలో వెళ్లాలనుకునేవారు ఇండోర్‌ ఎయిర్‌పోర్టులో దిగాలి. అక్కడికి 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాత్లాం వరకూ బస్సులో వెళ్లాలి. బస్టాండ్‌ నుంచి స్థానిక వాహనాల్లో ఆలయాన్ని చేరుకోవచ్చు. రైలు మార్గంలో వెళ్లేవారు ఉజ్జయిని స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి ఆలయానికి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది.