తొలి ఏకాదశి… నేటి నుంచి చాతుర్మాసం ప్రారంభం

Telugu Box Office

హిందువుల తొలి పండగ ఏకాదశి. ఏ మంచి పని ప్రారంభించినా హిందువులు దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తుంటారు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పాటిస్తారు. పూర్వకాలం ఇదే రోజును సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే శ్రీమహావిష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశి తర్వాతి రోజు ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అని అంటారు. అయితే ఈ నాలుగు మాసాలలో మీరు శ్రీమహావిష్ణువును పూజించవచ్చు ,ఉపవాసం చేయవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. చాతుర్మాసం ప్రారంభంతో వివాహం, క్షవరం , గృహ ప్రవేశం వంటి మొదలైన పనులు నిలిచిపోతాయి.

తొలి ఏకాదశి పురస్కరించుకుని భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేస్తారు. మరుసటి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదం స్వీకరించాక భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయనేది నమ్మకం. ఏకాదశి అంటే పదకొండు. జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, మనసు ఒకటి. వీటిని మానవుడు తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటన్నింటిని ఏకం చేసి దేవుడికి నివేదన చేయాలి. ఇలా చేయడం వల్ల మనిషిలోని బద్ధకం దూరమవుతుంది. రోగాలు దరి చేరవు. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. అందుకే తొలి ఏకాదశి ఆరోగ్యానికి తోడు ఆనందం సొంతం చేస్తుంది.

జాగారం సందర్భంగా సినిమాలు లాంటివి కాకుండా భాగవత పారాయణం, విష్ణుసహస్రనామం వంటివి పారాయణం చేస్తే మంచి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్లు ద్వాదశి రోజున దేవాలయానికి వెళ్లి ఉపవాసాన్ని విరమించాలి. ఏకాదశి పండగ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, పండ్లు, చందనం, అక్షింతలు, తమలపాకులు, తులసి ఆకులు, పంచామృతం వంటి వాటిని దేవుడికి సమర్పించాలి. కాగా తొలి ఏకాదశి నాడు జొన్నలతో తయారుచేసిన పేలాల పిండిని తినాలి. ఎందుకంటే పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. తొలి ఏకాదశి వ్రతం చేసేవాళ్లు మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసిన పదార్ధాలు భుజించకూడదు. అలాగే మంచంపై పడుకోరాదు.

Share This Article