పసుపు అధికంగా వాడుతున్నారా.. జాగ్రత్త!

Telugu Box Office

పసుపు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. పసుపులో కాల్షియం, విటమిన్ ఈ, విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనల్ని అనేక రకాల వైరస్‌ల నుంచి కాపాడుతాయి. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పసుపు అతిగా తీసుకుంటే శరీరానికి హాని కూడా చేస్తుంది. పసుపును ఎలాంటి వ్యక్తులు తినకూడదో, దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం…

చర్మ సమస్యలు

పరిమితికి మించి పసుపును తీసుకుంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతాయి. పసుపును అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. పసుపు చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పరిమిత పరిమాణంలో ఉపయోగించడమే ఉత్తమం. అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలి.

ఉదర సమస్యలు

వాస్తవానికి పసుపుని వేడిగా పరిగణిస్తారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు ఏర్పడుతాయి. ఇది కడుపులో మంటతో పాటు విరేచనాలకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు కడుపులో వాపు లేదా తిమ్మిరి సంభవిస్తుంది. కాబట్టి పసుపును ఎప్పుడూ పరిమితంగానే తీసుకోవాలి. అలాగే కామెర్లు వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు పొరపాటున కూడా పసుపు తినకూడదు. ఒకవేళ తింటే కామెర్లు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

కిడ్నీ సమస్యలున్న వారు
కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి పసుపు వాడకం మంచిది కాదు. పసుపులో ఉండే మూలకాలు రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా పసుపు తీసుకోవడం మంచిది కాదు.

ముక్కు నుంచి రక్తం వచ్చేవారికి

ముక్కు నుంచి రక్తం కారడం సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. పసుపు ప్రభావం వేడిగా ఉంటుంది. దీని కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం కావడాన్ని అధికంగా చేస్తుంది. అందుకే పరిమిత పరిమాణంలో పసుపును ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యంగా జీవించండి. అతి వాడకం అన్నింట్లోనూ ప్రమాదకరమే.

Share This Article