మెగాస్టార్ ‘ఆచార్య’ ఫస్ట్ సాంగ్ అదుర్స్‌

మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిందిన ‘ఆచార్య’ టీమ్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చరణ్ ఈ సినిమాను సిద్ధ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లోని మొదటి లిరికల్‌ సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం.

‘లాహే లాహే’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇందులో సీనియర్‌ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం‌ అందించగా.. మణిశర్మ స్వరాలు సమకుర్చారు. సింగర్స్‌ హరిక నారాయణ్‌, సాహితి చాగంటిలు ఆలపించిన ఈ పాటకు దినేష్‌ కొరియోగ్రఫీ అందించాడు.